జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీ సాయి చైతన్య, ప్రమాదానికి గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జాతీయ రహదారి, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి, ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ నియంత్రణ సూచికలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో వాహనదారులకు ఇబ్బంది లేకుండా వెలుతురు సదుపాయాలు కల్పించాలని సూచించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం మృత్యువుకు దారితీస్తుందని సీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో ఏసీపీ ప్రకాష్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్ఐ ఆరిఫ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
