నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వివిధ విభాగాల్లో సిబ్బంది లేకపోవడంతో పనులు పెండింగ్‌లో పడి, ప్రజలకు అందాల్సిన అత్యవసర సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) జిల్లా అధ్యక్షుడు జాఫర్ అలీ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల చర్చించామని, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేని విషయాన్ని ఆయన కూడా అంగీకరించారని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, పౌర సమస్యల పరిష్కారం, ఇతర ముఖ్యమైన మున్సిపల్ విధులు కుంటుపడటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించి సంబంధిత ఉన్నతాధికారుల తో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి, సమర్థవంతమైన పాలన అందించేందుకు తక్షణమే సిబ్బందిని భర్తీ చేయాలని కోరారు.
