ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాంకేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను ఈనెల 30, 2026లోగా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) స్పష్టం చేశారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎల్పీజీ డీలర్ల అసోసియేషన్‌తో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జారీ చేసిన ప్రధాన ఆదేశాలు ఇలా ఉన్నాయి: బయోమెట్రిక్ ఆధార్ ప్రక్రియ పూర్తి కాలేదనే కారణంతో ఏ ఒక్క వినియోగదారునికి కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయకూడదు.
ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే, సమాంతరంగా గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా అందించాలి. గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్లను వినియోగదారుల ఇంటి వద్దకే సరఫరా చేయాలి. ఇన్వాయిస్ (బిల్లు) లో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదు. అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే సదరు గ్యాస్ ఏజెన్సీ డీలర్లనే బాధ్యులను చేస్తూ ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, ప్రతి డెలివరీ సమయంలోనూ వన్-టైమ్ పాస్‌వర్డ్ ఆధారిత డెలివరీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డీలర్లు తమ కార్యాలయాల్లో గడువు తేదీలు మరియు ఫిర్యాదుల నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. ఈ సమావేశంలో జిల్లా సరఫరా అధికారి, జిల్లా సహాయ సరఫరా అధికారి ఎల్పీజీ డీలర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
