తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచం పాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టు కు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 .00 అడుగులు, 80.00 టీఎంసిలకు గాను, ప్రస్తుతం 1088 .8 అడుగులు, 72.6 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉందని అధికారులు తెలిపారు.
పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుండి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందన్నారు. దీంతో 40 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి లక్షా 63 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్ కు వివరించారు.
పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ, ఎగువ నుండి వస్తున్న ఇన్ ఫ్లో కు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరు కూడా గోదావరి పరీవాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ అన్నారు.
ముఖ్యంగా కొడిచెర్ల, చాకిరియాల్, సావెల్, తడపాకల్, దొంచందా, గుమ్మిర్యాల్ గ్రామాల వద్ద ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతతో కూడిన చర్యలు చేపడుతున్నామని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వెల్లడించారు.
లో లెవల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా, రోడ్ల పై నుండి వరద జలాలు ప్రవిహిస్తున్న మార్గాలలో వాహనాల రాకపోకలను దారి మళ్ళించామన్నారు. ప్రతి చోట అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు.
అక్కడక్కడా పురాతనమైన 32 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, జిల్లాలో ఇంతవరకు ఎక్కడ కూడా పంటనష్టం వంటివి జరగలేదని వెల్లడించారు. ముందస్తుగానే మూడు చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు .
———————–నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
