హత్య కేసులో ముగ్గురు నిందితులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితులు బింగేవార్ రాజమణి, బింగేవార్ రాజు అలియాస్ డైనేశ్వర్, అగపరాటే మాధవ్‌లకు శిక్ష ఖరారు చేసింది.
ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని స్పష్టం చేసింది.
టౌన్-VI పోలీస్‌స్టేషన్‌లో 2022లో నమోదైన క్రైం నంబర్ 69/2022కు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. తొలుత భారతీయ శిక్షాస్మృతిలోని 302, 34 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. విచారణలో నిందితులపై 304(II) సెక్షన్ కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.
ఈ మేరకు I అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హరీషా ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడించారు.ఈ కేసులో సావ్లీ గ్రామానికి చెందిన బింగేవార్ రాజమణి, ఆమె కుమారుడు బింగేవార్ రాజు అలియాస్ డైనేశ్వర్, బోసి గ్రామానికి చెందిన అగపరాటే మాధవ్ నిందితులుగా ఉన్నారు.
ప్రస్తుతం వీరు నిజామాబాద్ పరిధిలో నివాసం ఉంటున్నట్లు పోలీసుల వివరాలు.కేసు దర్యాప్తులో భాగంగా టౌన్-VI ఎస్‌ఐ అంజనేయులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం ఇన్‌స్పెక్టర్ విజయ్‌బాబు, సౌత్ రూరల్ సీఐ జె. నరేష్ దర్యాప్తు కొనసాగించారు. నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. నరసింహారెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. కోర్టు లైజన్ అధికారి టి. గోవింద్ తదితరులు కేసు విచారణకు సహకరించారు.
