మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష పడగా, మరో 40 మందికి కోర్టు భారీ జరిమానా విధించింది.
L ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు సోమవారం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పట్టుబడిన 43 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరిచారు.
కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి 40 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 4 లక్షల భారీ జరిమానా విధించారు.మద్యం మత్తులో వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురికి కోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
జైలుకు వెళ్లిన వారిలో పులాంగ్ ప్రాంతానికి చెందిన మహబూబ్ కుమారుడు షేక్ షఫీ (43), ఇంద్రపూర్ నివాసి రాజలింగం కుమారుడు చిన్న రాజు (30) మరియు మాకలూర్ ప్రాంతానికి చెందిన ఎల్లయ్య కుమారుడు కాసర్ల బాబన్న (32) ఉన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
