నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో గుప్తనిధుల కలకలం రేగింది.నాల్గో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు అక్కడ సొంత స్థలం ఉంది. అయితే, గత నాలుగైదు రోజులుగా ఆమె ఆ స్థలంలో రాత్రి వేళల్లో ఎవరికీ కనిపించకుండా చుట్టూ తడకలతో షెడ్‌లు వేసింది.
లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ.. అర్ధరాత్రి సమయాల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్విస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ అనుమానాస్పద శబ్దాలు వస్తుండటంతో గమనించిన స్థానికులు నిఘా పెట్టారు. అక్కడ గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.
ఈ విషయమై శుక్రవారం స్థానికులంతా కలిసి సదరు మహిళను నిలదీశారు. అక్కడ ఏం చేస్తున్నారని, గుంతలు ఎందుకు తవ్వుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దొరికిపోయానని గ్రహించిన ఆ మహిళ అక్కడి నుంచి సమాధానం దాటవేస్తూ చల్లగా జారుకుంది.
బహిరంగంగానే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో ఆందోళన చెందిన స్థానిక ప్రజలు వెంటనే నాల్గో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తడకల చాటున తవ్విన గుంతలను పరిశీలించారు.ఈ ఘటనపై పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సదరు మహిళ ఎందుకు తవ్వకాలు జరిపింది? దీని వెనుక ఎవరైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
