దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి నిజామాబాద్ లోకసభ స్థానం గెలవడానికి సర్వ శక్తులు ఒడ్డె పనిలో ఉంది.కంచుకోట లో ఎలాగైనా పాగ వేయాలనే పట్టుదలతో ఉంది. అందులోనూ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ఓడించే వ్యూహరచనను సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. నేతల మధ్య సమన్వయం అసెంబ్లీ ఎన్నికల్లో శరాఘాతం అయింది.
తగిని మూల్యం చెల్లించింది. అనేక మంది కీలక నేతలు లోపాయికారిగా బిఆర్ యస్ కు అనుకూలంగా పనిచేసారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అభ్యర్థులకోటరీ లో ఉండే వారే కోవర్టులుగా మారారు.అందుకే లోకసభ పరిధి లో ఏడూ అసెంబ్లీ సెగ్మెంట్ లుంటే కాంగ్రెస్ పార్టీ రెండే స్థానాలుగెల్చింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఓడిన నేతలకే సెగ్మెంట్ ల పెత్తనం అప్పగించారు. పార్టీలో పాలనలో వారు చెప్పిందే సాగుతుంది. దీనితో మొన్నటిదాకా బిఆర్ యస్ నేతలతో అంటకాగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు.
పదేళ్లు సహకరించిన బిఆర్ యస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తున్నారు.ఎడాపెడా చేరికలు పార్టీకి గతవైభవం తెచ్చిపెడుతున్నాయి.క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే నేతలు అధికార పార్టీలో వుంటే దందా లు చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ నీడలోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన లోకసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అభ్యర్థిగా ఖరారు చేసారు.
జిల్లా పార్టీలో సీనియర్ నేతలమధ్య సమన్వయ లోపం ఇంకా వెంటాడుతూనే ఉంది.కానీ లోకసభ నియోజకవర్గంలో జగిత్యాల్ జిల్లా కూడా ఉంది. రెండు జిల్లాల నేతలు కలసికట్టుగా పనిచేస్తే లోకసభ ఎన్నికల్లో సులువుగా గట్టెక్కుతారనే ధీమా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే ఆయన రెండు జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేసారు. దీనికి కొనసాగింపుగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు జిల్లాల కీలక నేతల ఉన్నత సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ సమావేశానికి చొరవ చూపెట్టారని సమాచారం.