HomeCRIMEచైనీస్‌ మంజా ముఠా గుట్టురట్టురూ.1.89 లక్షల విలువైన నిషేధిత మంజా స్వాధీనంముగ్గురి అరెస్ట్‌..

చైనీస్‌ మంజా ముఠా గుట్టురట్టురూ.1.89 లక్షల విలువైన నిషేధిత మంజా స్వాధీనంముగ్గురి అరెస్ట్‌..

యూపీకి చెందిన ప్రధాన సరఫరాదారు పరారీనిషేధిత చైనీస్‌ మంజా విక్రయిస్తున్న ముఠా గుట్టును రాజేంద్రనగర్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, కాలాపత్తర్‌ పోలీసులు రట్టు చేశారు. నిషేధిత సింథటిక్‌ మంజాను విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.89 లక్షల విలువైన 140 బాబిన్లు, 100 లచ్చాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మంజా సరఫరా చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్కీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోల్డెన్‌ జూబ్లీ స్కూల్‌ సమీపంలో చైనీస్‌ మంజా విక్రయాలు జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఈ నెల 25న టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా తద్బన్‌కు చెందిన మహమ్మద్‌ కలీమ్‌ (27), మహమ్మద్‌ యూనస్‌ (51), ఖాజీపురాకు చెందిన ఫహదుల్లా ఖాన్‌ (24)ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కలీమ్‌ మూడేళ్ల క్రితం ఫలక్‌నుమాలోని ఓ పతంగుల దుకాణంలో పనిచేసేవాడు. అక్కడ చైనీస్‌ మంజా విక్రయాల ద్వారా అధిక లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు.

ఆ తర్వాత ఉద్యోగం మానేసి, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన విక్కీతో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్‌పే వంటి ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా విక్కీకి డబ్బులు పంపించి, కొరియర్‌ ద్వారా చైనీస్‌ మంజాను తెప్పించేవాడు.

అనంతరం కాలాపత్తర్‌ పరిధిలో పతంగుల వ్యాపారం ప్రారంభించి, స్థానిక వ్యాపారులకు నిషేధిత మంజాను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.అరెస్టయిన కలీమ్‌పై గతంలోనూ కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం కాలాపత్తర్‌ పోలీసులకు అప్పగించారు. నిషేధిత చైనీస్‌ మంజా విక్రయాలు, నిల్వలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే 112కు ఫోన్‌ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మంజా వల్ల మనుషులతోపాటు పక్షులు, ఇతర జీవులకు ప్రాణాపాయం పొంచి ఉందని, దాని వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments