రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆనాథలను చేసి, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని టీఆర్ఎస్ నేత నవీన్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా, విత్తన సబ్సిడీ, రుణమాఫీ, యూరియా సరఫరా వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
అసలు ‘రైతు భరోసా’ పథకం ఉందా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చే ముందు రైతు భరోసా అని గొప్పలు చెప్పి, ఇప్పుడు ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. గతంలో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చి, మిగిలిన 3-4 సార్లు కొర్రీలు పెట్టారని, ఈ ఏడాది కూడా కేవలం రెండు ఎకరాల రైతులకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.
యాసంగిలో పెండింగ్ ఉన్న రైతు భరోసాను, ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం విత్తనాలను సబ్సిడీపై అందించడంలో కనీస సోయి కూడా లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
విత్తనాల కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం సప్లయ్ చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఎకరాకు రూ. 7 వేలు ఖర్చు చేసి రైతులు విత్తనాలు కొంటున్నారని, ప్రభుత్వ విత్తన సంస్థ ద్వారా వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
దాదాపు 50 శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. రైతులు రీషెడ్యూల్ చేసుకోకపోవడంతో వడ్డీ రాయితీ కోల్పోతున్నారని, సిబిల్ స్కోర్ దెబ్బతిని కొత్త అప్పులు పుట్టని దుస్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సగం మందికి కూడా రుణమాఫీ చేయని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలుపై క్లారిటీ లేక రైతులు నష్టానికి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఫుట్‌బాల్, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులను కాపాడటంలో లేదని, రైతులంటేనే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు అని దుయ్యబట్టారు.
యూరియా కోసం పెట్టిన యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రిప్ పరికరాలపైనా సబ్సిడీ ఎత్తివేసి రైతులపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితా ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
