నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇందల్వాయి జట్టుతో తలపడిన ఈ మ్యాచ్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇందల్వాయి జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 107 పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 4వ టౌన్ జట్టు బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
క్రమశిక్షణతో ఆడుతూ కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ముద్దాడారు. అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పీసీ మహేందర్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం వరించింది. విజేత జట్టు సభ్యులను తోటి సిబ్బంది, క్రీడాభిమానులు అభినందించారు.
