కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున ఒక రోగి ఆత్మహత్యాయత్నంతో ఆస్పత్రి వాతావరణం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన అవుసుల ప్రమోద్ (26) ఈనెల 12వ తేదీన పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు అతడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే, అతడు మద్యం లేక ఆందోళనకు గురవుతూ అసహనంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
క్రమంగా పిచ్చి ప్రవర్తనతో ఆస్పత్రి సిబ్బందికి కష్టాలు సృష్టించాడు. బుధవారం తెల్లవారుజామున, కాళ్లు, చేతులు కట్టివేసిన కట్టుపోయి ఉన్నా, అవి విప్పుకొని ఐసీయూలో ఉన్న సీజర్‌ను పట్టుకున్నాడు. ఆ సీజర్‌తో ఇతర రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ, డెలివరీ రూం మరియు లేబర్ రూంలోకి వెళ్లి లోపల నుంచి తాళం వేసుకున్నాడు.
అస్పత్రి సిబ్బంది అప్రమత్తమై వెంటనే లేబర్ రూం డోర్ అద్దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి, అతడిని అదుపులోకి తీసుకొచ్చారు. తిరిగి అతడిని ఐసీయూలోకి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు నిమిషాలు పాటు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
స్థానిక పోలీసులు మరియు ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సిబ్బందిని మరింత జాగ్రత్తగా ఉండమని ఆదేశాలు జారీ చేశారు.
