కొనుగోళ్లపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ, పట్టింపులేని తనం..ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం ఆ కుటుంబాల ఆశలను అడియాశలు చేసింది.
స్వేదం చిందించి పండించిన వరి ధాన్యం కళ్లముందు తడిసి ముద్దకావడంతో భీతిల్లిపోయారు. అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ,మాక్లూర్,ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి పోయాయి.
తూకాలకు సిద్దం చేసిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు అల్లాడిపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు మీద కల్లం పై పోసిన రాశుల కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. కల్లంపై పలుచగా పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అలాగే ధాన్యం నింపిన సంచుల కిందకు నీరు చేరాయి.
వర్షానికి కొంత మేర ధాన్యం తడిసింది. అకాల వర్షం అన్నదాతలలో అనునిత్యం ఆందోళన రేకెత్తిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.గత సంవత్సరంకంటే ధాన్యం దిగుబడి కొంత పెరిగిందని సంతోషించి క్షణకాలం కాకముందే ఈ పరిస్థితి దాపురించడంతో దేవుడిపై భారం వేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి నెలకొందంటూ వాపోయారు.
ధాన్యం కల్లాల్లో ఆరబోసి 20 రోజులైనా తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకవైపు అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్న, మరో వైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపై ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నా..
అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించడంలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
