నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇసుక, మొరం, నల్లమట్టి అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ,ఈ అక్రమ దందాలు యథేచ్ఛగా సాగుతుండటంతో, వీటిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ‘చీతా ఫోర్స్’ను రంగంలోకి దించారు.
సీపీ ఆదేశాల మేరకు చీతా ఫోర్స్ అక్రమ రవాణాపై విస్తృతంగా దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో బెరద పుట్టిస్తోంది. అయితే, వీరు ఎంతగా దాడులు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో స్థానిక పోలీసుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం కరవవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చీతా ఫోర్స్ అధికారులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, స్థానిక పోలీసుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లోని కొందరు స్థానిక పోలీస్ అధికారులు అక్రమార్కులతో లోపాయికారీగా చేతులు కలపడం వల్లే ఈ దందా సాగుతోందని సమాచారం. చీతా ఫోర్స్ దాడులు చేసి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తుంటే, తదుపరి దర్యాప్తును స్థానిక పోలీసులు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ‘సహకార లేమి’ కారణంగానే అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ దందాలను కొనసాగిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ (బిఆర్ఎస్) హయాంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో ఇసుక, మొరం, నల్లమట్టి దందాలు చేసిన వారంతా, ఇప్పుడు అధికార పార్టీ ముసుగు తొడుక్కొని మళ్లీ అదే తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల పేర్లు వాడుకుంటూ, వారి అండదండలతోనే ఈ దందాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ దందాల మరక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు కూడా అంటుకుంటోందని క్షేత్రస్థాయిలో టాక్ నడుస్తోంది.
ఏది ఏమైనా, క్షేత్రస్థాయిలో సీపీ పంపిన చీతా ఫోర్స్ ఒకవైపు ఉరుములు ఉరుముతున్నా.. స్థానిక ఖాకీల అండతో అక్రమార్కులు అంతే ధీమాగా దందాలు సాగించడం గమనార్హం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే అక్రమ రవాణా సాగడం వెనుక అసలు సూత్రధారులెవరో తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉంది.
