విద్యార్థి మృతి పై ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘం నాయకులు – ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మృతుడు గడ్డం సంతోష్ -సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్న ఆర్మూర్ పోలీసులు
ఆర్మూర్ మండలం లోని పిప్రి గ్రామ సమీపంలో వేల్పూర్ సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వేల్పూర్ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ ఉదయం వ్యాయామం పూర్తిచేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
డిగ్రీ కళాశాల వెనుక గల నర్సరీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక విద్యార్థి సంఘం నాయకులు సమాచారం తెలుసుకొని అధ్యాపకులను సంప్రదిస్తే మొదట తమ విద్యార్థి కాదని బుకాయించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
కళాశాల అధ్యాపకుల పర్యవేక్షణ లోపం వలన ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి ఖండిస్తూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నత అధికారులు ఈ ఆత్మహత్యపై విచారణ జరపాలని పిడియస్ యు నాయకులు డిమాండ్ చేశారు. గతంలో వేల్పూర్ కు చెందిన ఈ గురుకుల కళాశాల ఆర్మూర్ కు తరలించారు.
ఆర్మూర్ కు చెందిన సంక్షేమ కళాశాల ప్రాంగణంలోని వేల్పూర్ సంక్షేమ కళాశాల, హాస్టల్ కొనసాగుతోంది. ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
