సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో మంగళవారం బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు.
వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం ప్రశంసనీయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ప్రభు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
