సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపుల దందా..డాక్యుమెంట్ విలువను బట్టి వసూలు..అంతా దళారుల కనుసన్నల్లోనే..జిల్లా కేంద్రంలోని అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది.
అక్రమార్జనే లక్ష్యంగా ఇక్కడ కొర్రీల పేరుతో కలెక్షన్ నడుస్తోంది.ఏదో ఒక సాకుతో అందినకాడికి దండుకునే పనిలో కొందరున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పనికి ముందుగానే రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధం గా నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తు న్నారు. రియల్టర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు.
ఈ ఏడాది నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎసిబి సోదాలు నిర్వహించడం ఇది రెండో సారి. తాజాగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది.
మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలతో నిత్యం జనాలతో కిటకిటలాడే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారుల దాడులతో వేల వేల పోయింది.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కునసాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఏసీబీ బృందం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు చేశారు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది ముందుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లోపల నుండి తాళాలు వేసి, లోపల ఉన్న సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ఇతరులను బయటికి రాకుండా కట్టడి చేశారు.
అలాగే బయట వ్యక్తులను సైతం సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనికి అనుమతులు ఇవ్వడం లేదు. కార్యాలయంలోని డాక్యుమెంట్ లతోపాటు ఫైళ్లను సైతం ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే నకిలీ రిజిస్ట్రేషన్లు, అక్రమ డాక్యుమెంట్లో పై వచ్చిన ఫిర్యాదుల కారణంగానే ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఏసీబీ బృందం సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాల కు హుటాహుటిన తాళాలు వేసి అక్కడనుండి కనిపించకుండా వెళ్లిపోయారు.
అయితే ఈ ఏడాది మార్చి లో సబ్ రిజిస్ట్రారు -2 గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. అధికారుల్లో ఆందోళన..
జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవినీతి అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ నిఘా పెంచడంతో అధికారుల్లో ఆందోళన కలుగుతోంది. ఏసీబీ అధికారుల వరుసదాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖల్లో ఏసీబీ సోదాలు జరగడం, ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. దీంతో మిగితా శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
