నిజామాబాద్ నగరంలో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో రోడ్డుపై పడవేయడం స్థానికంగా కలకలం రేపింది.
నగరంలోని రద్దీగా ఉండే ఖలీల్ వాడి ప్రాంతంలో రోడ్డు పక్కన పడి ఉన్న నవజాత శిశువును స్థానికులు గమనించారు. చూసిన వారు భయాందోళనకు గురై, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి అమానుష చర్యకు పాల్పడింది ఎవరనే దానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నవజాత శిశువును స్వాధీనం చేసుకుని, తదుపరి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
