జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని, గ్రామగ్రామాన పార్టీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ మేరకు శనివారం నగరంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.
పార్టీ పటిష్టతకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం..
డిసెంబర్ ఒకటో తేదీన తాను జిల్లా అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు (ప్రమాణ స్వీకారం) నగేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ వస్తున్నారని తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అలాగే తన నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్య నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, టీపీసీసీ సెక్రటరీ రాంభూపాల్,టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మైనార్టీ సభ్యులు జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
