వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు
వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు నూతన ఉత్సాహంతో, లక్ష్యసాధనకు కృషి చేసే సంకల్పంతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, కృషితో చదువులో రాణించి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో సాగేందుకు అవసరమైన అవకాశాలు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకత, విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేలా విద్యాబోధన చేయాలని కోరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థికి విజయాలు, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అనుభవాలను అందించాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
