దేశంలో అక్షరాస్యత, మహిళా సాధికారత కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, ఆమె ఆలోచనా విధానం నేటి తరానికి మార్గదర్శకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
నిజామాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆయన బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అణచివేతకు గురవుతున్న వర్గాల కోసం, ముఖ్యంగా మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సమాజంలో మార్పు రావాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన గొప్ప సంస్కర్త ఆమె అని పేర్కొన్నారు.
నిజామాబాద్ నడిబొడ్డున ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇది యువతలో సామాజిక స్పృహను పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.విగ్రహావిష్కరణ అనంతరం పూలే దంపతుల సేవలను వక్తలు స్మరించుకున్నారు.పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంతో పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్‌బిన్ హందాని, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
