HomeCRIMEఆటో డ్రైవర్ హత్య కేసులో 'ఉరి' శిక్ష!నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

ఆటో డ్రైవర్ హత్య కేసులో ‘ఉరి’ శిక్ష!నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

ఆటో, సెల్‌ఫోన్ కోసం దారుణ హత్య.. మృతదేహం దహనం

శాస్త్రీయ ఆధారాలతో నిందితుడికి మరణశిక్ష ఖరారు

పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన సీపీ సాయి చైతన్య

నగరంలో పెను సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ కండేల సందీప్ హత్య కేసులో నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆటో, సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని కాల్చివేసిన నిందితుడికి మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసి, నిందితుడికి అత్యున్నత శిక్ష పడేలా చేసిన పోలీస్ యంత్రాంగాన్ని సర్వత్రా అభినందిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సందీప్ (28) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఫిబ్రవరి 15న ఆటోతో బయటకు వెళ్లిన ఆయన రాత్రికి తిరిగి రాలేదు. దీంతో భార్య లత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. మద్యం, కల్లు అలవాట్లకు బానిసైన నిందితుడు.. సందీప్‌ను మత్తులోకి దించి, చంద్రాయణపల్లి గ్రామ శివారులోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సందీప్‌ను కిందకు తోసి, రాయితో ఛాతిపై బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. అనంతరం ఆటో, ఫోన్ అపహరించి..

నేరం బయటపడకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుడిని పోలీసులు గాలం వేసి పట్టుకున్నారు. నిందితుడు స్వచ్ఛందంగా నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు హత్యకు ఉపయోగించిన రాయి, చోరీ చేసిన ఆటోను పోలీసులకు చూపించాడు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నార్త్ రూరల్ సిఐ బి. శ్రీనివాస్, టౌన్-V ఎస్సై ఎం. గంగాధర్ బృందం పక్కా ఆధారాలను కోర్టు ముందుంచింది. సోమవారం ప్రత్యేక సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ నిందితుడిని దోషిగా తేలుస్తూ కఠిన శిక్షలు ఖరారు చేశారు: మరణశిక్ష (ఉరిశిక్ష) మరియు రూ.10,000 జరిమానా. సెక్షన్ 238 (ఆధారాల విధ్వంసం): 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా.సెక్షన్ 307 (దోపిడీ ప్రయత్నం): 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించారు.

కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసీక్యూటర్ రాజ్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, కానిస్టేబుళ్లు సాయన్న, శ్రీనివాస్, రాజు, సచిన్, దత్తాత్రేయగౌడ్‌లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. నేరగాళ్లకు ఈ తీర్పు ఒక హెచ్చరిక అని సీపీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments