Sunday, April 19, 2026
HomeCRIMEఅభివృద్ధి అటకెక్కి.. ఆధిపత్యం రోడ్డెక్కి! సర్పంచ్ వెర్సెస్ ఉప సర్పంచ్: రణరంగంగా మారిన ఎం.ఎస్.సి ఫారం..చేతిలో...

అభివృద్ధి అటకెక్కి.. ఆధిపత్యం రోడ్డెక్కి! సర్పంచ్ వెర్సెస్ ఉప సర్పంచ్: రణరంగంగా మారిన ఎం.ఎస్.సి ఫారం..చేతిలో రాయితో మహిళా సర్పంచ్ వీరంగం..

ముక్కున వేలేసుకున్న గ్రామస్థులుగ్రామ వికాసానికి బాటలు వేయాల్సిన ప్రజాప్రతినిధులు.. పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే వీధి పోరాటాలకు దిగారు. అభివృద్ధి పనుల విషయంలో మొదలైన చర్చ కాస్తా.. వ్యక్తిగత కక్షలు, వర్గ పోరుగా మారి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎం.ఎస్.సి ఫారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి తీర్మానం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమయ్యారు.

అయితే, సదరు స్థలం భవన నిర్మాణానికి అనుకూలంగా లేదని, ఇరువైపులా రహదారులు ఉన్నందున స్థలం సరిపోదని ఉప సర్పంచ్ బషీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇతర అనుకూల ప్రాంతాల్లో భవనం నిర్మిద్దామని ఆయన సూచించగా, సర్పంచ్ పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.

సమావేశం నుంచి ఉప సర్పంచ్ నిష్క్రమించగా, సర్పంచ్ పట్టుదలకు పోయి వెంటనే అదే స్థలంలో మొరం పోయించారు. అయితే, ఆ స్థలం పక్కనే ఉప సర్పంచ్ నివాసం ఉండటం, అటుగా వెళ్లే దారిని అడ్డుకునేలా మొరం పోయడం వివాదాన్ని మరింత రాజేసింది. ఉప సర్పంచ్ వర్గీయులు ఆ మొరాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి.

శాంతింపజేయాల్సిన సర్పంచ్ నోముల జయశ్రీ, స్వయంగా చేతిలోకి రాయి తీసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను బెదిరించడం అక్కడున్న వారందరినీ విస్మయానికి గురిచేసింది. ఒక మహిళా సర్పంచ్ అయి ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా రౌద్ర రూపం దాల్చడంపై గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు.

తోపులాటలు, వాగ్వాదాలతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే, ఎన్నికలు ముగిసి నెల కూడా గడవకముందే గ్రామం రెండు వర్గాలుగా విడిపోవడంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!