నేటి తరం యువతకు స్వామి వివేకానంద ఆశయాలు, ఆలోచనలు దిక్సూచిలాంటివని యువి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుజన్ కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సుజన్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు.
ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని, యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలను ఆచరిస్తూ, ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మార్గదర్శి..
వివేకానందఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్ మాట్లాడుతూ.. వివేకానందుడి ఆదర్శాలు యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. యువశక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి ఆయనని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మద్ది గంగాధర్, దర్శనం రాజు, సిర్పలింగం, ధన్పల్ రాజేష్, శ్రీను సతీష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
