సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లోకి ప్రవేశించాలంటే ఇకపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. రోడ్డు భద్రతా నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏసీపీ శుక్రవారం ఐడీఓసీని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ లేని ఉద్యోగులను, సిబ్బందిని కార్యాలయం లోపలికి అనుమతించవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏడాది కాలంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా హెల్మెట్ ధరించి సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. “ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు..
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఏసీపీ ఆదేశాలతో పోలీసులు ఐడీఓసీ ద్వారం వద్ద కఠిన తనిఖీలు చేపట్టారు.
హెల్మెట్ లేకుండా వచ్చిన పలువురు ఉద్యోగులను లోపలికి అనుమతించకపోవడంతో వారు విధులకు హాజరు కాలేక వెనుదిరిగారు.
నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించే కార్యాలయానికి రావాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై షరీఫ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
