హిందూ దేవతలను అవహేళన చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు..
బిజెపి శ్రేణుల సంబరాల్లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి సాధించిన అఖండ విజయం, తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు దిక్సూచి అని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో బిజెపి ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నగరంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి విజయోత్సాహాన్ని చాటారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని 29 కార్పొరేషన్ స్థానాలకు గాను 26 చోట్ల మహాయుతి జయకేతనం ఎగురవేయడం చారిత్రాత్మకమన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని విమర్శించారు.
తెలంగాణలో కూడా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం కావడం ఖాయమని, ముఖ్యంగా ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
“అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హిందూ దేవతలపై ఒట్టు వేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మన దేవతలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారు.
హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది” అని ధన్ పాల్ హెచ్చరించారు. గతంలో హిందూ ప్రయోజనాల కోసం పోరాడిన శివసేన, అధికారం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపి తన అస్తిత్వాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు.
మహారాష్ట్రలో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో బిజెపి తన సత్తా చాటుతుందని స్పష్టం చేశారు.
