ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదునగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకత్వమే ఆసరగా, ఆశే పెట్టుబడిగా మాయమాటలు చెబుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి సుమారు రూ.2.53 లక్షలు పోగొట్టుకున్నారు.
కారు ఆశ చూపి.. రూ.1.43 లక్షలు ఊడ్చేసి! ముదిరాజ్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మెడిసిన్ వ్యాపారానికి సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. గతేడాది నవంబరులో ఆ గ్రూపు ద్వారా ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘మెడిసిన్‌పై 1+1 ఆఫర్’ ఉందని నమ్మబలికాడు. అది నిజమని నమ్మిన శ్రీనివాస్ రూ.1200 వెచ్చించి మందులు ఆర్డర్ చేశాడు.
బాధితుడు తమ వలలో చిక్కాడని గ్రహించిన సైబర్ నేరగాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టాడు. “మీరు ఖరీదైన కారు గెలుచుకున్నారు” అంటూ శ్రీనివాస్‌కు నమ్మకమైన కబురు పంపాడు.
కారు డెలివరీ కావాలంటే పన్నులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఖర్చుల పేరిట విడతల వారీగా రూ.1,43,000 వసూలు చేశాడు. ఇంకా డబ్బు కావాలని వేధిస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
*ట్రేడింగ్ టిప్స్ పేరిట మరో దగా..* పూసలగల్లికి చెందిన అగర్వాల్ అనే వ్యాపారి సైబర్ దొంగల మరో బాధితుడు. ట్రేడింగ్‌లో మెళకువలు చెబుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేశారు. కేవలం రూ.3000 పంపిస్తే టిప్స్ ఇస్తామని నమ్మించి ఒక క్యూఆర్ కోడ్‌ను పంపారు.
బాధితుడు ఆ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు పంపిన కొద్దిసేపటికే.. ఆయనకు తెలియకుండానే ఖాతా నుంచి ఏకంగా రూ.1,10,000 మాయమయ్యాయి. ఫోన్ చూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ రెండు ఘటనలపై బాధితులు శుక్రవారం ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రఘుపతి తెలిపారు. *అప్రమత్తతే రక్షణ: ఎస్‌హెచ్‌ఓ రఘుపతి* గుర్తుతెలియని లింకులు, క్యూఆర్ కోడ్స్: ఫోన్‌కు వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు.
ఉచితం/ఆఫర్లు, లక్కీ డ్రాలో బహుమతులు వచ్చాయని ఎవరైనా చెబితే నమ్మవద్దు.అలాంటివి రాగానే వెంటనే లేదా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలనీ ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు:
