మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో 158 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయనీ తెలిపారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 158 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులను సంబంధిత న్యాయస్థానాల్లో హాజరుపరచగా, కోర్టు వారికి రూ. 14,50,000/- జరిమానాలతో పాటు 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. సీపీ మాట్లాడుతూ “ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
