గాంధీ చౌక్‌లో బాపు విగ్రహానికి ఘన నివాళులు.. దేశ స్వాతంత్ర్యం కోసం శాంతి, అహింసా మార్గాల్లో పోరాడి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే కుట్రకు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆరోపించారు.
శుక్రవారం గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనూ, అనంతరం గాంధీ చౌక్‌లోని బాపు విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాల వల్లే నేడు దేశం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో గ్రామీణ వలసలను నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారని గుర్తుచేశారు.
దానికి ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ అని పేరు పెట్టి, నిధుల భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరు వింటేనే భయపడుతోందని, అందుకే ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్ జీ గా మారుస్తూ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
పని దినాలను 125 రోజులకు పెంచుతున్నట్లు చెబుతూనే, అందులో 50 రోజుల భారాన్ని రాష్ట్రాలపై నెట్టడం అన్యాయమన్నారు. దీనివల్ల రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ 100 రోజుల వేతనాన్ని కేంద్రమే ఇచ్చేలా చేసిందని, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగాలని డిమాండ్ చేశారు.
గాంధీ పేరును తొలగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కాగానే మళ్లీ ఈ పథకానికి మహాత్ముడి పేరును పునరుద్ధరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు గణరాజ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, డిచ్పల్లి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు, వివిధ సెల్ల అధ్యక్షులు వినయ్, ఎజాస్, మార్కెట్ కమిటీ సభ్యులు ఈసా, స్వప్న, బంటు బలరాం, సలీం తదితరులు పాల్గొన్నారు.
