నగర అభివృద్ధి హస్తం పార్టీతోనే సాధ్యం.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నగర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి, భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ కోరారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. గతంలో తాను మేయర్‌గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ హయాంలోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సంజయ్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలోనే నగరం సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన వేగంగా జరిగిందని పేర్కొన్నారు. అయితే, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరం పూర్తిగా అధ్వానంగా మారిందని, అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు.
శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాకు మున్సిపల్ మంత్రిగా వ్యవహరిస్తూ అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం శుభపరిణామమని సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి చొరవతో నిజామాబాద్ నగరం మరిత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అందుకే నగర ప్రజలు ఆలోచించి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
