పిలిస్తే పలికే నాయకులను గెలిపించుకుందాంరాజకీయాలంటే ఏసీ కార్లలో తిరుగుతూ, అద్దాల వెనుక నుంచి చేతులు ఊపడం కాదని.. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కోటగల్లిలో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని, ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం సృష్టించిందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా పేదలకు సన్నబియ్యం ఇచ్చే పరిస్థితి లేదని, కానీ మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ఒక యజ్ఞంలా చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హామీ ఇచ్చినట్లుగా.. నిజామాబాద్‌ను మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. 35 ఏళ్ల నిజామాబాద్ ప్రజల కల అయిన ఇంజనీరింగ్ కళాశాలను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే సాధించానని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
అభివృద్ధిని గాలికొదిలేసి బీజేపీ నేతలు కేవలం దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలు చూస్తుంటే చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల వేళ ఓటు వేసి గెలిపిస్తే.. ఆ తర్వాత ప్రజలను విస్మరించిన నాయకులకు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేసే నాయకులను, అందుబాటులో ఉండే కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి ఇందూరు అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
