రేవంత్ రెడ్డి పర్యటన కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందని, జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల వేళ పర్యటించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ నగరం మురికి కూపంగా మారిందని మండిపడ్డారు.
సొంత బావమరిదిపై ఆరోపణలు వస్తే, వాటిని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ కుటుంబంపై విచారణల పేరుతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని, బీఆర్ఎస్ ఇస్తున్న గట్టి పోటీని చూసి ఓర్వలేకనే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు అని అనడం దురదృష్టకరం..నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీ తీస్తేనే రెండు పార్టీలు సతమతమయై పోయారు. నగరంలో బిఆర్ఎస్ గట్టి పోటీనీస్తుందనీ అన్నారు.
అప్పులు తెచ్చారు.. అభివృద్ధి ఎక్కడ?: బాజిరెడ్డి గోవర్ధన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3.75 లక్షల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నూతన కలెక్టరేట్లు, ఐటీ హబ్ లు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే.. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ తెచ్చిన రూ. 3 లక్షల కోట్ల అప్పు ఏమైందని మాజీ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
“కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు.. ఏమైంది? రైతు బంధు, రైతు భరోసా అతీగతీ లేదు. కేసీఆర్ కట్టిన సచివాలయంలో కూర్చుని ఆయననే విమర్శించడం సిగ్గుచేటు” అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణకు పట్టిన శని రేవంత్: జీవన్ రెడ్డి
రేవంత్ రెడ్డిని ‘గజదొంగ’గా అభివర్ణిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్, రాష్ట్రాన్ని మురికిరెడ్డిలా మార్చారు. ఆడబిడ్డలకు స్కూటీలు, వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ హామీలు ఏమయ్యాయి?” అని నిలదీశారు.
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్న ఆయన, కేసీఆర్ అంటే ఒక చరిత్ర అని, దానిని ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తికి కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు.
ఈ సమావేశంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్, సుజిత్ సింగ్ ఠాగూర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
