నిజామాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పోలీసు అవుట్‌పోస్టు ‘సమయపాలన’ గాలికి కొట్టుకుపోతోంది. ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సిబ్బంది, విధులకు రాక తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ బాధితుల పాలిట శాపంగా మారుతున్నారు. ఎంతో వేదనతో ఆసుపత్రికి వచ్చే బాధితులు, సిబ్బంది కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.
నిబంధనల ప్రకారం, అవుట్‌పోస్టులో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆసుపత్రిలో ఎమ్‌ఎల్‌సీ పనుల కోసం, అలాగే మరణించిన వారి బంధువులు డెత్ సర్టిఫికెట్ లేదా ఇతరత్రా అత్యవసర ధ్రువీకరణ పత్రాల కోసం అవుట్‌పోస్టుకు వస్తుంటారు.
అయితే, కీలక సమయంలో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది అక్కడ లేకపోవడం దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. తాము గంటల తరబడి ఎదురుచూస్తున్నా, సిబ్బంది మాత్రం తమ మొబైల్ ఫోన్లు లేదా ఇతర పనుల్లో నిమగ్నమై, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
బాధితుల గోడు పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.సమయం దాటిపోతున్నా సేవలు అందడం లేదు.. బాధ్యత ఎవరిది?” అని వారు నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ ఆసుపత్రి అవుట్‌పోస్టులో సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచాలని, బాధితులకు సత్వర సేవలు అందేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
