నగరంలో తెల్లవారుజామున ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని దుండగుడు గొలుసు చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని ఎఫ్‌సీఐ కాలనీ, సాయి నివాస్ స్ట్రీట్ నంబర్-3లో నివసించే ఓ మహిళ, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల సమయంలో వాష్‌రూమ్ నిమిత్తం ఇంటి బయటకు వచ్చారు. అదే సమయంలో అక్కడ మాటు వేసి ఉన్న అజ్ఞాత దుండగుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. మహిళ మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును లాక్కొని, క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు.
దుండగుడి దాడితో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు వెంటనే కుటుంబ సభ్యులకు, ఆపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న నాలుగవ టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించిన పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
