చెరకు లోడుతో చక్కెర కర్మాగారానికి వెళ్తున్న ఎడ్లబండ్లను వేగంగా వచ్చిన ఒక డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. బండ్లపై ఉన్న ముగ్గురు రైతులు రక్తగాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నెహ్రూ నాయక్, బన్ను నాయక్, మారుతి నాయక్ అనే ముగ్గురు రైతులు తమ మూడు ఎడ్లబండ్లపై చెరకు లోడు నింపుకుని కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు ఎల్లారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి బయలుదేరారు. మార్గమధ్యంలో అటుగా అతివేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం నియంత్రణ కోల్పోయి వరుసగా మూడు ఎడ్లబండ్లను బలంగా ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టిన ధాటికి ఎడ్లబండ్లు రోడ్డుపై పల్టీ కొట్టాయి.
ఒక ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రెండో ఎద్దు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది.అలాగే బండ్లపై కూర్చున్న నెహ్రూ నాయక్, బన్ను నాయక్, మారుతి నాయక్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన రైతులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న రైతుల ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
