HomeTelanganaNizamabadఅర్బన్‌లో నత్తనడకన సర్..!జిల్లాలో 80.68% పూర్తి..

అర్బన్‌లో నత్తనడకన సర్..!జిల్లాలో 80.68% పూర్తి..

గ్రామీణం లక్ష్యానికి చేరువ.. నగరంలో ఇంకా వేలాది కుటుంబాలకు చేరని బీఎల్‌వోలుఆగస్టు 3తో గడువు ముగింపు.. ఫారాలు, పత్రాల సేకరణలో ప్రజలకు ఇబ్బందులు..

అధికారుల పరుగులుకేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సర్వే (ఎస్‌ఐఆర్) జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించడం, అనర్హులను తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చడం లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 80.68 శాతం సర్వే పూర్తయింది.

అయితే గడువు ముగియడానికి రోజులు దగ్గరపడుతున్నా, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో సర్వే ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం అధికారులను కలవరపెడుతోంది. సర్వే ప్రారంభమైనప్పటి నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఓటర్ల నుంచి గుర్తింపు పత్రాలు, అవసరమైన వివరాలు తీసుకుని ఫారాలు పూర్తి చేస్తున్నారు.

కానీ పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, అపార్ట్‌మెంట్ సంస్కృతి, వలసలు వంటి కారణాలతో చాలామంది ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు మందగిస్తోంది. మరోవైపు, కొంతమంది బీఎల్‌వోలు ఇంటికి రాకపోవడం, ఒకేసారి ఎక్కువ మంది రావాలని చెప్పడం, పత్రాలపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు లక్ష్యానికి చేరువయ్యాయి. నిజామాబాద్ రూరల్‌లో 93 శాతం సర్వే పూర్తవగా, బాన్సువాడ, బాల్కొండలో 92 శాతం, ఆర్మూర్‌లో 91 శాతం, బోధన్‌లో 90 శాతం నమోదైంది. కానీ నిజామాబాద్ అర్బన్‌లో మాత్రం 71 శాతం మాత్రమే పూర్తవడం విశేషం.

మున్సిపల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో 60 నుంచి 65 శాతం మధ్యే నమోదు కొనసాగుతోంది. బూత్‌ల వారీగా చూస్తే బూత్ నంబర్-40లో 87 శాతం నమోదు కావడం విశేషం. మరోవైపు మిర్చి కాంపౌండ్ పరిధిలోని బూత్ నంబర్-44లో కేవలం 51 శాతం మాత్రమే నమోదవడం ఆ ప్రాంతంలో సర్వే ఎంత మందగించిందో తెలియజేస్తోంది.

ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ ఇంటింటికీ వెళ్లాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు సమాచారం. ఇక సర్వే సందర్భంగా పలు సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి.

కొందరు ఓటర్లు తమ వద్ద అవసరమైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతుండగా, మరికొందరు బీఎల్‌వోలు పలుమార్లు వచ్చినా తాము ఇంటి వద్ద లేమని చెబుతున్నారు. మరికొందరు ఫారాల నింపడం, పత్రాల సమర్పణపై స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఎన్నికల శాఖ హెల్ప్‌డెస్క్‌లు, బీఎల్‌వోల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు 3తో సర్వే గడువు ముగియనుంది.

ఈ నేపథ్యంలో మిగిలిన ప్రతి ఇంటిని చేరుకోవడంతో పాటు, ఒక్క అర్హుడూ ఓటరు జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గడువులోపు వివరాలు నమోదు చేయించుకోని వారు వెంటనే సంబంధిత బీఎల్‌వోలను లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

*జిల్లాలో సర్వే పురోగతి*

జిల్లా మొత్తం – 80.68%

నిజామాబాద్ రూరల్ – 93%

బాన్సువాడ – 92%

బాల్కొండ – 92%

ఆర్మూర్ – 91%

బోధన్ – 90%

నిజామాబాద్ అర్బన్ – 71%

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments