HomeLaw and Orderపదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు ..లీకేజీలు, అక్రమాలకు తావు కల్పిస్తే...

పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు ..లీకేజీలు, అక్రమాలకు తావు కల్పిస్తే కఠిన చర్యలు ..సమన్వయక సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి..

పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 14 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 9.30 నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,542 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎస్సెస్సి పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో 24,399 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా, 143 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం 144 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా ఈ నెల (ఫిబ్రవరి) 25 నుండి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు, ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది కలుపుకుని మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లను ఎగ్జామ్ సెంటర్లలో నియమించాలని, ప్రథమ చికిత్స సదుపాయం అందుబాటులో ఉండాలని, పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనవకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే లోనికి అనుమతించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం అయినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎంతో అప్రమత్తంగా ఉంటూ, పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా జరిగేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు ఎంతో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణలో ఏ దశలోనూ పొరపాట్లకు అవకాశం కల్పించవద్దని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, అవకతవకలకు తావు కల్పించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఏసీపీ మస్తాన్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. —————————–నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments