మోర్తాడ్ మండలంలోని గండ్లపేట్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదుతో పాటు వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మోర్తాడ్ ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండల పరిధిలోని గండ్లపేట్ శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందింది.
ఈ మేరకు మోర్తాడ్ ఎస్సై రాము తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆ ప్రాంతంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 1,820 నగదుతో పాటు, 3 మోటార్ సైకిళ్లు, ఒక కారు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాము తెలిపారు.
