నిజామాబాద్, ఫిబ్రవరి 23 :
అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపధ్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మున్సిపల్ కమిషనర్లను, ఎన్నికల విధులలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు.
అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఎ.ఓ ప్రశాంత్ పాల్గొనగా, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, ఉమా మహేశ్వర్ రావు, గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, రిటర్నింగ్ అధికారులు నర్సయ్య, జి.నరేష్, జే.బస్వంత్, హఫీజుద్దీన్ లను కలెక్టర్ సత్కరించారు.
కాగా, అధికారులు అందరు కలిసి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మార్గనిర్దేశం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఘనంగా సన్మానించారు.
