నిజామాబాద్ న్యాల్‌కల్ రోడ్డులోని ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ డివిజనల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు లిఫ్ట్‌లపై ఆధారపడుతున్నారని, దీంతో రోడ్డు ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ వద్ద బస్సులను నిలిపేలా డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అలాగే రాజరాజేంద్ర చౌరస్తా వద్ద విద్యార్థులను ఎక్కించుకోవడం, దించడం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రంపై బస్టాండ్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారులతో చర్చించి రాజరాజేంద్ర చౌరస్తా వద్ద బస్సులు నిలిపేలా, డిపో-2 నుంచి వచ్చే బస్సులను హాస్టల్ వద్ద కనీసం ఒక నిమిషం నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆర్టీసీ బస్ పాస్‌లు తీసుకోవాలని సూచించారు.
సమస్యను త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన ఆర్టీసీ అధికారులకు టీజీవీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
హామీని త్వరితగతిన అమలు చేసి విద్యార్థులకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా కార్యదర్శి వినయ్, కార్యకర్తలు సాయి, గణేష్, ఉదయ్‌సాయి, అనూష తదితరులు పాల్గొన్నారు.
