ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న శ్రీ సాయి విద్యాలయంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఇందూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాఠశాలలో పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్ పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వెళ్లే విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తున్న విషయాన్ని జూలై 30న ఏబీవీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆగస్టు 1న పాఠశాలలోని బుక్ స్టోర్‌ను అధికారులు సీజ్ చేశారని తెలిపారు.
అయితే సీజ్ చేసిన పుస్తకాల గదిని కొద్ది రోజులకే తిరిగి తెరవడంపై అధికారులు వివరణ ఇవ్వాలని అక్షయ్ డిమాండ్ చేశారు. పాఠశాలపై సమగ్ర తనిఖీ నిర్వహించి నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్రమాలను ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏబీవీపీపై అసత్య ప్రచారాలను సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ఏబీవీపీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనల అమలును విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలకు అడ్డుకట్ట వేయాలని అక్షయ్ కోరారు.
శ్రీ సాయి విద్యాలయంపై సమగ్ర విచారణ జరిపి, తప్పులు రుజువైతే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓను డిమాండ్ చేశారు.సమావేశంలో యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, నితిన్, సందీప్, గౌతమ్‌తో పాటు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
