నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఉద్రిక్తత..శవంతో ఆసుపత్రి ముందు నిరసన.. సామాన్య చెవినొప్పితో ఆసుపత్రికి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (22) అనే యువకుడు వైద్యుల తప్పిదానికి బలయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని ద్వారకా ఆసుపత్రి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పల్లికొండకు చెందిన మున్నూరు కాపు కులస్థుడైన అజయ్ (తండ్రి నరసయ్య) గత కొంతకాలంగా చెవినొప్పితో బాధపడుతున్నాడనీ తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా ఆసుపత్రిలో చేర్పించారు.
మంగళవారం మధ్యాహ్నం అతనికి చెవికి సంబంధించిన శస్త్రచికిత్స (ఆపరేషన్) నిర్వహించిన వైద్యులు, అనంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపరేషన్ జరిగిన కొద్ది గంటలకే అజయ్ పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యుడు ఒక్కసారిగా చేతులెత్తేస్తూ.. “పేషెంట్ సీరియస్‌గా ఉన్నాడు, వెంటనే హోప్ ఆసుపత్రికి తీసుకెళ్లండి” అని సలహా ఇచ్చారనీ అన్నారు.
కంగారుపడిన బంధువులు అజయ్‌ను హోప్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు అతను మృతి చెందాడనీ అన్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుడు కేవలం చెవి ఆపరేషన్‌తో ఎలా చనిపోతాడని బంధువులు మండిపడుతున్నారు.
ద్వారకా ఆసుపత్రి వైద్యుల అనుభవలేమి, నిర్లక్ష్యం వల్లే అజయ్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ.. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరిగి ద్వారకా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆసుపత్రి ముందు శవంతో బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
