నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించి 13 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ విద్యార్థులకు శాశ్వత క్రీడా మైదానం (గ్రౌండ్) కేటాయించకపోవడంపై జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు కదం తొక్కారు. బుధవారం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (JUDA) ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
తమ రోజువారీ విధులు, తరగతులకు హాజరవుతూనే ఈ ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఓపీ గేటు వద్ద శాంతియుతంగా సమావేశమై తమ డిమాండ్లను మీడియా ముందు ఉంచారు.ఈ సందర్భంగా జూడా ప్రతినిధులు మాట్లాడుతూ.. మెడికల్ కోర్సు అనేది అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, అటువంటి సమయంలో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రాథమిక వసతులలో భాగమైన గ్రౌండ్ లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యా, క్రీడా, వ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం పడుతోంది. శారీరక వ్యాయామం లేకపోవడంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఒత్తిడిని తగ్గించుకునే మార్గం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు” అని వారు పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీకి వెంటనే సొంత క్రీడా మైదానాన్ని కేటాయించాలి. విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా క్రీడా సౌకర్యాలు కల్పించాలి. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు
.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రౌండ్ సమస్యను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా. కార్తిక్ కొమ్మనబోయిన, జనరల్ సెక్రటరీ డా. జయంత్, వైస్ ప్రెసిడెంట్ డా. సంతోష్, అడ్వైజరీ కమిటీ సభ్యులు డా. చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీలు డా. వక్వార్, డా. హేమంత్, డా. రవి రాథోడ్, పెద్ద సంఖ్యలో మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు..
