గతంలో హిందువులను అవమానించేలా ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అని వ్యాఖ్యానించిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఎలాగైతే బొంద పెట్టారో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం కామారెడ్డి నుంచి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు గాంధారి క్రాస్ రోడ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవీ దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాలు, దేవతలు, మహిళలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోకపోవడం అరాచకమన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో ఎమ్మెల్యేపై జరిగిన దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి, పాతబస్తీలో హనుమాన్ ఆలయంపై దాడి ఘటనలు చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను ‘రేవంత్ ఉద్దీన్’ అని పలకాలని చెప్పడం, ‘కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్’ అని వ్యాఖ్యానించడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇకపై హిందూ దేవాలయాలపై, ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, రేవంత్ సర్కార్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
