ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి మాట్లాడుతూ.. శ్రీపాదరావు సౌమ్య మనస్తత్వం కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ప్రజానాయకుడిగా ఆయన ముద్ర ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఆయన ప్రదర్శించిన నిజాయితీ, నిరాడంబరత నేటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎనలేనిదని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, శ్రీనివాస్, పి.సి.ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్‌తో పాటు సి.ఎస్.బి, ఐటీ కోర్, సెంట్రల్ కంప్లైంట్ సెల్, సి.సి.ఆర్.బి విభాగాల సిబ్బంది, జిల్లా పోలీస్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
