మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. చాలెంజ్ లేని జీవితం చప్పడి కూర వంటిది.. ప్రతి మహిళా ఆత్మస్థైర్యంతో సమస్యలను అధిగమించి ఆదర్శంగా నిలవాలి” అని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు.
శుక్రవారం నిజామాబాద్‌లోని విజయలక్ష్మి గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, 1911లో మహిళా సమానత్వం కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరానికి గాను “గివ్ టు గైన్” అనే నినాదాన్ని ఇచ్చిందని, మహిళలకు అవకాశాలు ఇస్తే వారు సమాజానికి అంతకంటే ఎక్కువే తిరిగి ఇస్తారని పేర్కొన్నారు.
లింగ వివక్షను విడనాడి ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు బాసటగా నిలవాలని కోరారు.తన జీవిత ప్రయాణాన్ని విద్యార్థినులకు వివరిస్తూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.
చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది.. ఆ విజ్ఞానమే మనల్ని సమాజంలో రాణించేలా చేస్తుంది. పదో తరగతిలోనే విప్లవోద్యమం వైపు వెళ్లి నక్సలైట్‌గా ఏ కోర్టులోనైతే నిలబడ్డానో, చదువుకున్నాక అదే కోర్టులో అడ్వకేట్‌గా నిలబడగలిగాను. నా గురువు వెంకటస్వామి రెడ్డి ఆదర్శంతో నిర్దోషిగా బయటపడి, నేడు మీ ముందు మంత్రిగా ఉన్నాను.
ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే సాధ్యమైంది” అని అన్నారు. ప్రతి మహిళా కంపాషన్ (కరుణ), కమిట్మెంట్ (కట్టుబాటు), కరేజ్ (ధైర్యం) కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా కోటి మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు.
జీరో వడ్డీ రుణాలు అందిస్తున్నామని, 15 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు సంఘాల్లో సభ్యత్వం కల్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. అబ్రహం లింకన్, మదర్ థెరిసా, మేరీకోమ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఓటమిని విజయానికి నాందిగా మార్చుకోవాలని విద్యార్థినులకు హితబోధ చేశారు.
*యువత రక్షణే లక్ష్యం: సీపీ సాయి చైతన్య* నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ.. జిల్లాలో భద్రత, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అంశాలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. డ్రగ్స్ వంటి మహమ్మారికి యువత దూరంగా ఉండాలని కోరారు. అనంతరం మహిళల రక్షణ కోసం రూపొందించిన సురక్ష దీప్ భద్రతా బోర్డులను, కౌన్సిల్ బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఈ బోర్డులను ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేస్తామని, ఇది మహిళల సమస్యల పరిష్కారానికి భరోసానిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ కె. ఉమారాణి, ఎన్.ఎస్.సి కన్వీనర్ జి. బస్వారెడ్డి (డీసీపీ), ట్రెజరర్ కె. సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి, కామారెడ్డి ఏసీపీ చైతన్య రెడ్డి, డి.ఎఫ్.ఓ నిఖిత, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
