పదవులు వచ్చాయని అహంకారంతో వ్యవహరిస్తే రాజకీయంగా అంధకారం తప్పదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. “ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార గర్వంతో విర్రవీగింది. రైతులను, ఉద్యోగులను, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా అహంకారపూరిత పాలన సాగించింది.
అందుకే నేడు ఆ పార్టీ మట్టిలో కలిసిపోయిందనీ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం శుక్రవారం నగర శివారులోని కమ్మ సంఘం భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు గెలుపు గర్వంతో కాకుండా, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ముందుకు సాగాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ చరిత్రలో రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు అని విమర్శించారు.
ప్రజల కష్టాల్లో తోడున్న వారికే ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.రాజకీయాల్లో హుందాతనం గురించి వివరిస్తూ మాజీ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డీఎస్)ను ఈటల గుర్తు చేసుకున్నారు. “నేను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో డీఎస్ ప్రతిపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ, నా బడ్జెట్‌ను తన రాజకీయ గురువు అర్గుల రాజారాం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పోల్చుతూ ప్రశంసించారు.
ప్రతిపక్షం అంటే కేవలం విమర్శించడం మాత్రమే కాదు, అధికార పక్షం అంటే అధికారాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదు.. డీఎస్ ప్రదర్శించిన హుందాతనం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం” అని కొనియాడారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన ప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. *సౌమ్యం.. వేగం.. కలిస్తేనే విజయం! ఎంపీ ధర్మపురి అరవింద్* రాష్ట్రవ్యాప్తంగా హుందాగా ఉండే అతికొద్ది మంది నాయకుల్లో ఈటల రాజేందర్ ఒకరని అర్వింద్ కొనియాడారు. “ఈటల గారు చాలా సౌమ్యులు.. నేను కొంచెం వేగంగా స్పందిస్తాను.
మా ఇద్దరి కలయికతో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం” అని జోస్యం చెప్పారు.అందుకే ఈ విజయ ఉత్సవానికి ఆయన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించామని పేర్కొన్నారు.రాజకీయం అంటే వ్యాపారం కాదు.. అది ప్రజల నమ్మకంతో కూడిన ప్రజాస్వామ్య ప్రక్రియ. ఎవరినీ కొనుగోలు చేసి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ మొత్తంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే అత్యధికంగా కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లను బీజేపీ గెలుచుకుందని అర్వింద్ వెల్లడించారు. “ఇక్కడ అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాలని చూశాయి. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాయి. గతంలోనూ మాకు 28 సీట్లు వచ్చాయి, ఇప్పుడు కూడా 28 సీట్లు గెలిచాం.
ఎంఐఎం మినహా మిగిలిన పార్టీలన్నీ సున్నాకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది” అని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాగే భ్రష్టు పట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని విమర్శించారు.హుందా రాజకీయాలు చూడాలంటే నిజామాబాద్ పార్లమెంట్‌ను చూసి నేర్చుకోవాలని అర్వింద్ హితబోధ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
“వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే వస్తాయి.. ఇది ఇప్పుడే చెప్పేస్తున్నా” అని జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ లు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
