14 మందికి జైలు శిక్ష ..
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 230 కేసులు నమోదయ్యాయనీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ వివరాలను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 230 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని సంబంధిత న్యాయస్థానాల్లో హాజరుపరచగా, కోర్టు వీరికి మొత్తం రూ. 21,60,000 జరిమానా విధించింది. వీరిలో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని సీపీ పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ప్రజల భద్రత దృష్ట్యా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి.
