HomeLaw and Orderనిజామాబాద్‌ టౌన్‌ప్లానింగ్‌లో ఒక్కసారిగా ఖాళీ!..​బదిలీపై వెళ్ళిన ఇద్దరు ఏసీపీలు.. బాధ్యతల్లో ఇన్‌చార్జి

నిజామాబాద్‌ టౌన్‌ప్లానింగ్‌లో ఒక్కసారిగా ఖాళీ!..​బదిలీపై వెళ్ళిన ఇద్దరు ఏసీపీలు.. బాధ్యతల్లో ఇన్‌చార్జి

నిజామాబాద్‌ నగర పాలక సంస్థలో కీలకమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఒక్కసారిగా కుంటుపడే పరిస్థితి నెలకొంది. నగర అభివృద్ధికి దిశానిర్దేశం చేయడంలో, భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించడంలో ప్రధాన పాత్ర పోషించే ఇద్దరు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు (ఏసీపీ) శ్రీధర్‌, శ్రీనివాస్‌లు శనివారం అనూహ్యంగా బదిలీ అయ్యారు. వీరిద్దరినీ రాజధానిలోని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసే వరకు టౌన్‌ప్లానింగ్‌ అధికారి ప్రదీప్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.నగరం 60 డివిజన్లుగా విస్తరించి, శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త లేఅవుట్లు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్న తరుణంలో ఇద్దరు అధికారులు ఒక్కసారిగా వెళ్ళిపోవడం పెను ప్రభావం చూపనుంది.

ప్రతిరోజూ పదుల సంఖ్యలో వచ్చే భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు ఇప్పుడు అధికారుల కొరతతో మూలనపడే అవకాశం ఉంది. ఏసీపీ స్థాయి అధికారి సంతకం లేనిదే ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి.కేవలం కార్యాలయ పనులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిర్మాణాల తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఆ పర్యవేక్షణ పూర్తిగా లోపించే వీలుంది.ఉన్న పళంగా ఇద్దరు అధికారులు బదిలీ కావడంతో ఇన్‌చార్జి అధికారిపై పనిభారం పెరగడంతో,సామాన్య ప్రజలు చిన్న చిన్న పనుల కోసం, క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరు భవన నిర్మాణ ఫీజులు.

అధికారుల కొరత కారణంగా అనుమతులు జాప్యం అయితే, అది పరోక్షంగా కార్పొరేషన్ ఖజానాపై ప్రభావం చూపుతుంది. ఒకేసారి ఇద్దరు అధికారులు బదిలీ కావడంతో ఉత్పన్నమయ్యే పరిణామాలను మున్సిపల్‌ కమిషనర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలో నిర్మాణ రంగం కుంటుపడకుండా ఉండాలన్నా, ప్రజలకు సకాలంలో సేవలు అందాలన్నా వెంటనే పూర్తిస్థాయి అధికారులను నియమించాలని కోరుతూ ఉన్నతాధికారులకు అత్యవసర నివేదిక పంపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త అధికారులను నియమిస్తుందా? లేక ఇన్‌చార్జి పాలనతోనే నెట్టుకొస్తారా అన్నది వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments