Monday, April 20, 2026
HomeLaw and Orderఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి ...అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి …అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ళను లబ్దిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, తాగునీటి సరఫరా, గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులు, యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ళ నిర్మాణాలు, ఎరువుల పంపిణీ, పంటలకు సాగు నీటి లభ్యత తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష జరిపారు.

ఒక్కో నియోజకవర్గం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి కనిపించడం లేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటిని ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేలా కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళ నిర్మాణాలలో వేగం పెరగాలని, ప్రభుత్వం మలి విడత మంజూరీలు ఇచ్చేందుకు సన్నద్ధం అయినందున మొదటి విడత ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించాలని అన్నారు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.

కాగా, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాలికాబద్దంగా వ్యవహరించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. కొత్తగా బోర్లు వేయడం కంటే, ఉన్న వాటినే ఫ్లషింగ్ చేయించడం, అవసరమైన మరమ్మతులు జరిపించాలని హితవు పలికారు.

పైప్ లైన్ నిర్మాణాలను పూర్తి చేయించాలని, ప్రతి నివాస ప్రాంతానికి మిషన్ భగీరథ శుద్ధి జలాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇదిలాఉండగా, రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, సాగు నీటి సమస్య సైతం తలెత్తకుండా చూడాలన్నారు.

ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టు వరకు పంటలకు సాగు జలాలు చేరేలా అవసరమైన చోట కాల్వలకు మరమ్మతులు జరిపించాలని అన్నారు. పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులలో అవగాహన పెంపొందించాలని, ఆరుతడి పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

కాగా, భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో పంట పొలాలలో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులను నాణ్యతతో పక్కాగా చేయించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణాలకు అవసరమైన స్థలాల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.

సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీ.ఆర్.డీ.ఓ సాయగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!